కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. శిధిలాల మధ్య చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి ఘటన తీవ్రంగా కలిచివేసింది. తమ ప్రియమైనవారిని కోల్పోయిన వారందరికీ, అలాగే గాయపడినవారి కోసం నా ప్రార్ధనలు’ అని పేర్కొంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. శిధిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించడంలో భాగంగా రెస్క్యూ ఆపరేషన్స్ శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే కేరళ సీఎం పినరయి విజయన్‌తో ప్రస్తుత పరిస్థితుల గురించి ఆరా తీసి.. కేంద్రం నుంచి అందాల్సిన సాయంపై కూడా భరోసా ఇచ్చారు ప్రధాని మోదీ. కేంద్రం తరపున చనిపోయినవారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు ప్రధాని మోదీ.అసలేం జరిగిందంటే..
వయనాడ్‌లో ఎడతెరిపిలేని భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 19 మృతదేహాల్ని వెలికి తీశారు. చాలామంది తీవ్రగాయాలతో బయటపడ్డారు. వందల ఇళ్లపై ఈ కొండచరియలు పడడంతో నష్టం భారీగా ఉండొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. కొండచరియలు విరిగిపడటంతో సూరల మలై గ్రామం పూర్తిగా ధ్వంసమైంది. కన్నూరు నుంచి ప్రభావితా ప్రాంతాలకు వచ్చే మార్గాలు పరిస్థితి కూడా ఇదే. గాయపడ్డవారిని మెప్పడి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద వందలమంది చిక్కుకున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ముమ్మరం చేశాయి. తమిళనాడులోని అరకోణం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాల తరలించారు. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. కేరళ CM పినరయి విజయన్ ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఆధారిటీ కూడా యాక్షన్‌లోకి దిగింది. యమర్జెన్సీ సేవల కోసం హెల్ప్‌లైన్ నంబర్లను కూడా విడుదల చేశారు. సహాయక చర్యల్లో 2 ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్లు భాగమయ్యాయి. సులూర్ ఎయిర్‌బేస్ నుంచి Mi-17, ALH హెలికాప్టర్లు ఇప్పటికే బయల్దేరి.. ఘటనాస్థలికి చేరుకున్నాయి. వైతిరి, కల్పట్ట, మెప్పడి, మనంతవాడిలోని ఆసుపత్రులను గాయపడినవారి కోసం కేరళ ప్రభుత్వం సిద్ధం చేసింది.