మళ్లీ… మళ్లీ… అదే విధ్వంసం.. అదే విషాదం.. దేవభూమిగా పేరున్న అందాల కేరళలో ప్రతి ఏటా జులై, ఆగస్టు నెలలు వస్తే చాలు… ప్రజలే కాదు.. ప్రభుత్వాలు కూడా ఏ క్షణం ఏం జరుగుతుందా…? అని అనుక్షణం టెన్షన్‌తో వణికిపోతుంటాయి. ఏటా వచ్చే రుతుపవనాలు… కేవలం వర్షాలను మాత్రమే కురిపించి ఆగిపోవడం లేదు. విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. 2015 నుంచి 2022 మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా కొండచరియలు విరిగిపడ్డ ఘటనలు 3 వేల 782 జరిగితే అందులో కేరళలోనే అత్యధికంగా జరిగాయన్నది పార్లమెంట్ సాక్షిగా 2022లో నాటి కేంద్ర భూగర్భ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ వెల్లడించిన వాస్తవం.
తాజాగా మరోసారి వయనాడ్‌లో జిల్లాలో వర్షాలు, వరదలు సృష్టించిన బీభత్సంతో కేరళ తీవ్రంగా తల్లడిల్లిపోతోంది. అందాల టీ తోటలకు, పచ్చని ప్రకృతికి పేరున్న వయనాడ్ ఇప్పుడు వరదలధాటికి భయానకంగా మారింది. ముఖ్యంగా వయనాడ్ జిల్లాలోని మెప్పాడి, చురామల, మందక్కాయి, అట్టమల, నులుప్పుజ పరిసర ప్రాంతాల్లో విరిగిపడ్డ కొండచరియలు వందలాది కుటుంబాలలో విషాదం నింపాయి. మృతుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. భారీ వర్షాలు కూడా కురుస్తూ ఉండటం స్థానిక నదులు ఉప్పొంగుతున్నాయి. నీటిలో కొట్టుకొస్తున్న మృత దేహాల్లో తమ వారున్నారేమో అన్న భయం, ఆందోళన స్థానికుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఏటా జరుగుతున్న ఈ విధ్వంసానికి ఇప్పటికే కొన్ని కళ్లు అలవాటుపడిపోయినా… తమ కళ్ల ముందే తమ రక్తసంబంధీకులు, స్నేహితులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోతుంటే వారి దుఃఖాన్ని ఆపడం ఎవ్వరి తరం కావడం లేదు.
జులై, ఆగస్టు వస్తే చాలు వణుకే!
నిజానికి ఈ పరిస్థితి కేరళకు కొత్తేం కాదు. జులై, ఆగస్టు నెలలు వస్తే చాలు కేరళలో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం కొన్నేళ్లుగా సర్వ సాధారణంగా మారుతూ వస్తోంది. కేరళకు పశ్చిమాన విస్తారమైన సముద్రతీరం ఉంటే… తూర్పున పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ప్రతి జులై నెలాఖరు, ఆగస్టు నెలల్లో విస్తారమైన వర్షాలు కురుస్తాయి. ఫలితంగా కొండల్లో ఉన్న సెలయేళ్లు, నదులు ఉధృతంగా ప్రవహిస్తూ కొన్ని సార్లు ఈ ప్రమాదాలకు కారణం అవుతున్నాయి.
2018లో వచ్చిన వరదలు కేరళలో విధ్వంసం సృష్టించాయి. సుమారు 600 మంది ప్రాణాలు కోల్పోగా ఏకంగా 31 వేల కోట్ల రూపాయలన ఆస్తి నష్టం సంభవించింది. ఈ ప్రకృతి విపత్తు 2015-2019 మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పుల కారణంగా సంభవించిన అత్యంత ఘోర విపత్తులలో ఒకటిగా పేర్కొంది ప్రపంచ వాతావరణ సంస్థ.
2019లోనూ సంభవించిన వరదల కారణంగా 121 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 2 లక్షల మంది బాధితులుగా మిగిలారు. అలాగే అదే ఏడాది కొండచరియలు విరిగిపడ్డ ఘటనల్లో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 22 వేల మంది నిరాశ్రయులయ్యారు.
2020 ఆగస్టులో ఇడుక్కి, వయనాడ్, మలప్పురం, కొట్టాయం ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు, విరిగిపడ్డ కొండచరియలు కారణంగా 66మంది ప్రాణాలు కోల్పోయారు. 2021లో 42 మంది, 2022లో 32 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. తాజాగా వయనాడ్ జిల్లాలో జరిగిన ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టం ఇంకా పూర్తి స్థాయిలో వెల్లడి కావాల్సి ఉంది. డేంజర్ జోన్‌లో ఆ నాలుగు
2024 జనవరిలో కేరళ యూనివర్శిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ సైన్సెస్ .. మిచిగాన్ టెక్నాలాజికల్ యూనివర్శిటీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియరాలజీలు సంయుక్తంగా చేసిన పరిశోధనలో కేరళకు సంబంధించి ప్రమాద ఘంటికలు మోగించే వాస్తవాలు వెల్లడయ్యాయి. రాష్ట్రం మొత్తం మీద 13 శాతం భూభాగంలో ల్యాండ్ స్లైడ్స్ విరుచుకుపడే ప్రమాదం ఉందని తేలింది. ప్రధానంగా ఇడుక్కి, పాలక్కడ్, మలప్పురం, పతనమిట్ట, వయనాడ్ ప్రాంతాలు అత్యంత ప్రమాదకరమైన జోన్‌లో ఉన్నాయని ఆ పరిశోధన వెల్లడించింది.
ఏఐ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నప్రాంతాల మ్యాప్‌ను సిద్ధం చేసింది కేరళ యూనివర్శిటీ ఆఫ్ ఫిషరీస్. తమ పరిశోధనలో భాగంగా 1990 నుంచి 2020 వరకు జరిగిన ప్రకృతి విపత్తులను పరిశీలించింది. అలాగే ఓ మొబైల్ యాప్‌ను కూడా త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాటు చేస్తోంది. దాని ద్వారా ప్రమాదకరమైన ప్రాంతాలను ముందే గుర్తించి… భారీ వర్షాల సమయంలో అక్కడ నుంచి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే వీలుంటందని అధికారులు భావిస్తున్నారు.కేరళలో వరద బీభత్సం
3.46% పెరిగింది
2018లో సంభవించిన వర్ష బీభత్సం తర్వాత కేరళలో ల్యాండ్ స్లైడ్ జోన్ 3.46 శాతం పెరిగినట్టు వారి పరిశోధనలో తేలింది. ఏఐ పరిజ్ఞానం సాయంతో సుమారు 3వేల 575 ల్యాండ్ స్లైడ్స్‌ను విశ్లేషించిన తర్వాతే ఒక నిర్ణయానికి వచ్చినట్టు యూనివర్శిటీ వెల్లడిచింది.
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధన ప్రకారం కేరళలో 43 శాతం భూభాగం భూపాతానికి గురయ్యే ప్రమాదం ఉందని తేలింది. ఇడుక్కిలో 74 శాతం, వయనాడ్‌లో 51 శాతం భూభాగం ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉందని ఆ సంస్థ వెల్లడించింది.
2019లో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో కేరళ వ్యాప్తంగా 80 సంభవించాయి. 2018లో ఏకంగా 341 ఘటనలు జరిగాయి. వాటిల్లో కేవలం ఇరుక్కి జిల్లాలోనే 143 ఘటనలు జరిగాయి.
2015 నుంచి 2022 మధ్య కాలంలో మొత్తంగా 3782 ఘటనలు సంభవించగా అందులో కేవలం దక్షిణాదిలోనే 2239 ప్రమాదాలు జరిగాయి. మిగిలిన ప్రాంతాల్లో చూస్తే అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా 376 ఘటనలు జరిగాయి. 2018 నుంచి 2021 మధ్య కాలంలో కేవలం ఒక్క కేరళ రాష్ట్రంలోనే సుమారు600 మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
మూడో స్థానంలో కేరళ
గడిచిన 30 ఏళ్లలో కేరళ రాష్ట్రంలో రుతుపవనాలు అడుగుపెట్టే సమయంలో అంటే జూన్, జులైన నెలల్లో కురిసే వర్షాల శాతం తగ్గుతూ వస్తోంది. అదే సమయంలో ఆగస్టు – సెప్టెంబర్ సమయాల్లో మాత్రం వర్షపాతం పెరుగుతూ వస్తోందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. దేశ వ్యాప్తంగా కొండచరియలు విరిగి పడే ఘటనలు అత్యధికంగా జరుగుతున్న రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ మొదటి స్థానంలోనూ, ఉత్తరాఖండ్ రెండో స్థానంలోనూ, కేరళ రాష్ట్రం మూడో స్థానంలోనూ ఉన్నాయి.
నిపుణులు ఏం చెబుతున్నారు?
ఈ విషయంలో కేరళ దీర్ఘకాలిక వ్యూహాలను సిద్ధం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కేరళలో భూనిర్మాణంలో శరవేగంగా మార్పులు జరుగుతున్నాయని, అవి భారీ వర్షాలకు తట్టుకునే స్థితిలో ఉండటం లేదని నిపుణుల మాట. మరీ ముఖ్యంగా గడిచిన నాలుగైదేళ్లలో ఈ మార్పులు చాలా వేగంగా జరుగుతున్నాయన్నది వారి హెచ్చరిక. ఈ విషయంలో శాస్త్రీయ పరిజ్ఞానంతో నిర్మాణాత్మక చర్యలు తీసుకోకపోవడం వల్లే ఏ ఏటికాయేడు మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోందని వారు చెబుతున్నారు. గడిచిన నాలుగైదేళ్ల వర్షపాతాలను గమనిస్తే ఏడాది మొత్తం మీద కురిసే వానలో సగం కన్నా ఎక్కువ ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో కేవలం ఒకట్రెండు వారాలలోనే కురుస్తోంది.ఒక్క వయనాడ్ జిల్లానే చూస్తే గడిచిన కొన్నేళ్లుగా కురుస్తున్న వర్షం… ఆ జిల్లాను ప్రమాదకరంగా మారుస్తోంది. 2019లో కురిచర్మల ప్రాతంలో ఏకంగా 4000 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. నిజానికి అక్కడ పదేళ్ల సరాసరి వర్షపాతమే కేవలం 2200 మిల్లీమీటర్లు.
రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వయనాడ్ ప్రాంతం మొత్తం తేమగా మారిపోయింది. అటు అరేబియా తీరంలో దట్టమైన మేఘాల వ్యవస్థ ఏర్పడింది. దీన్నే మీసో స్కేల్ క్లౌడ్ సిస్టమ్ అంటారు. దీంతో వయనాడ్, కొలికోడ్, మలప్పురం, కన్నూర్‌లలో భారీ వర్షాలు కురిశాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో నేల మొత్తం తేమగా మారిపోవడంతో కొండచరియలు విరిగిపడ్డాయని అంచనా వేస్తున్నారు. అలాగే అరేబియా సముద్రం వేడెక్కడం వల్ల గుజరాత్ తీరం నుంచి కేరళ తీరం వరకు దీని ప్రభావం ఉందని చెబుతున్నారు. మరోవైపు కాలుష్యం వల్ల భూమి ఉష్ణోగ్రత పెరిగి అది వాతావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తోందని దాని ప్రభావమే ఇలాంటి ఉత్పాతాలన్నది వారు చెబుతున్న మాట.
ఒక్క భారత దేశంలోనే ఇలా జరుగుతోందా?
ప్రకృతి విపత్తులకు యావత్ ప్రపంచం అల్లాడిపోతోంది. మరీ ముఖ్యంగా కొండచరియలు విరిగిపడటం ఇటీవల కాలంలో సర్వ సాధారణంగా మారుతోంది. కొద్ది రోజుల క్రితం ఇథియోపియాలో కొండచరియలు విరిగిపడటంతో సుమారు 260 మంది ప్రాణాలు కోల్పోగా.. వారి సంఖ్య రెట్టింపు ఉండే అవకాశం ఉందని యునైటెడ్ నేషన్స్ హ్యూమానిటేరియన్ ఏజెన్సీ వెల్లడించింది. 2024 మే నెలలో పాపువా న్యూ గినియాలో కొండ చరియలు విరిగిపడ్డ ప్రమాదంలో ఏకంగా 2000 మందికి పైగా అమాయక జనం ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చనని అంచనా.కొండచరియలు విరిగి పడ్డ కారణంగా 1980 నుంచి 2018 మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా జరిగిన విషాదాలపై 2020లో ప్రపంచ బ్యాంక్ ఓ నివేదిక వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం భారీ వర్షాలు, కొండ చరియలు విరిగిపడ్డ ప్రమాదాల్లో అత్యధిక సంఖ్యలో ప్రజల ప్రాణాలు కోల్పోతున్న దేశాలలో భారత్ మూడో స్థానంలో ఉంది. 2020 నాటి లెక్కల ప్రకారం 1980 నుంచి 2018 మధ్య కాలంలో ఏకంగా 31 వేల 430 ప్రజలు మరణించారు. ఈ నివేదికలో 36వేల 150 మరణాలతో అమెరికా మొదటి స్థానంలోనూ, 35వేల280 మరణాలతో చైనా రెండో స్థానంలోనూ ఉంది.
ఎక్కడ ఈ ప్రమాదాలు జరగొచ్చు?
ప్రపంచ ఆరోగ్య సంస్థ అందించిన వివరాల ప్రకారం నిటారుగా ఉండే కొండలు, లోయల దిగువ భాగాలు, కార్చిచ్చులో కాలిపోయిన భూభాగాలు, అడవుల్ని విపరీతంగా కొట్టేసిన భూభాగాలు, అలాగే నీటిలో ఎక్కువ కాలం నానిన ప్రాంతాలు, వాగులు, నదుల ప్రవాహ మార్గాల్లో ఊండే భూభాగాల్లో ఎక్కువ ల్యాండ్ స్లైడ్స్ జరిగే ప్రమాదం ఉంటుంది. కేరళలో కొండ ప్రాంతం కావడం, వందల ఏళ్లుగా ఆ కొండ ప్రాంతాల్లో జరుగుతున్న పోడు వ్యవసాయం వల్ల మారిపోయిన భూ స్వరూపం అలాగే విపరీతమైన వర్షాల కారణంగా నీటిలో ఎక్కువ కాలం నాని ఉండటం వల్ల తరచు కొండచరియలు విరిగి పడుతున్నాయన్నది నిపుణుల మాట.
ఉష్ణోగ్రతల్లో విపరీత మార్పులు, వాతావరణంలో జరుగుతున్న పరిణామాలు కొండ చరియలు విరిగిపడటాన్ని మరింత పెంచుతాయి. వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు అధిక వర్షాలకు దారి తీస్తుండగా.. ఆ వర్షాల వల్ల పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి.
ఈ ప్రమాదాల విషయంలో ఏం చెయ్యలేమా..?
ఈ ప్రశ్నకు అంతా మన చేతుల్లోనే ఉందంటున్నారు యూఎస్ జియోలాజికల్ సర్వే శాస్త్రవేత్తలు. పర్వత ప్రాంతాల్లో, నదీ పరీవాహక ప్రాంతాల్లో నేల క్షయం కాకుండా కాపాడేప్రయత్నాలను మరింత ముమ్మరం చెయ్యాలి. అలాగే పర్వత ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉన్న చోట్ల రిటైనింగ్ వాల్స్ ఏర్పాటు చెయ్యాలి. ఆ నేల అడుగు భాగాన్ని మరింత ధృడంగా తయారయ్యేలా నిర్మాణాలు చేపట్టాలి. అలాగే కొండపై నుంచి జారే పడే రాళ్లకు ఆయా చోట్ల ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చెయ్యడం ద్వారా కొంత మేర ప్రాణ నష్టాన్ని తగ్గించవచ్చు.