అక్టోబర్ 7న రాత్రి 11 గంటల నుంచి అక్టోబర్ 8 అర్ధరాత్రి వరకు కొండపైకి ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, ఎన్‌ఆర్‌ఐలు, శిశువులు ఉన్న తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు, అన్ని ఆర్జిత సేవలు, రద్దు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4 నుండి 12 వరకు జరగనున్నాయి. ఈ మేరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై టిటిడి దృష్టి సారించింది. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లకు సన్నద్దం అయ్యింది. ప్రత్యేక దర్శనాలు, అర్జిత సేవాలను రద్దు చేయనుంది.
తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఇక రెండు నెలలు మాత్రమే సమయం ఉండటంతో టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అధికార యంత్రాంగం తో సమీక్ష నిర్వహించారు. అత్యంత వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని అదనపు సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో జరిగిన మొదటి సమీక్ష సమావేశంలో శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు. ఇంజినీరింగ్ పనులు, వాహనాల ఫిట్‌నెస్, లడ్డూ బఫర్ స్టాక్, అన్నప్రసాదం, దర్శనం, వసతి, కళా బృందాల కార్యక్రమాలు, ఉద్యానవన శాఖ, ట్రాన్స్ పోర్ట్, కళ్యాణ కట్ట, గోశాల, శ్రీవారి సేవకులు, భద్రతా ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.వార్షిక బ్రహ్మోత్సవాలకు అక్టోబర్ 3 న అంకురార్పణ జరగనుండగా అక్టోబర్ 4న ధ్వజారోహణంతో ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 8న గరుడసేవ, అక్టోబర్ 9న స్వర్ణరథం, 11న రథోత్సవం, అక్టోబర్ 12న చక్రస్నానం నిర్వహిస్తారు. ఇక వాహన సేవలు ప్రతి రోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానున్నాయి. గరుడ సేవ రోజు భక్తుల రద్దీ కారణంగా అక్టోబర్ 7 రాత్రి 11 గంటల నుండి అక్టోబర్ 8 అర్ధరాత్రి వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై తిరుమల ఘాట్ రోడ్లలో నిషేధం అమలు కానుంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో వయోవృద్ధులు, వికలాంగులు, ఎన్‌ఆర్‌ఐలు, చిన్న పిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.