దేశవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలు కొనసాగుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో ఉత్తరాది వణికిపోతోంది. జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు వరదలు ముంచెత్తడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది.మధ్యప్రదేశ్‌లో భీకర వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల వల్ల గోపాద, నర్మదా నదుల ఉగ్రరూపంగా దాల్చి.. ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. నర్మదా నది ప్రవాహంలో ఘాట్‌లు, మందిరాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. వరద ముప్పుతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది ప్రభుత్వం. మరోవైపు భోపాల్‌లో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు ముంచెత్తింది. కాలనీలు అన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోని వరదనీరు చేరడంతో జనం అవస్థలు పడుతున్నారు. రోడ్లపై భారీగా వరద నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. పుణేలో ముఠా, పావన నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల వల్ల పుణేలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అపార్ట్‌మెంట్లలోని వరద నీరు చేరడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఏక్తా నగర్‌కు సైన్యాన్ని రప్పించారు అధికారులు. వరద ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని బోట్ల సహాయంతో రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ఆర్మీ, ఫైర్ సిబ్బంది. ముంబై వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మెరైన్ డ్రైవ్‌లోని సముద్ర తీరంలో అధిక ఆటుపోట్లతో రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. ముంబైకి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది IMD. ముంబైలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అటు ముంబైకి నీటిని అందించే.. వైతర్ణ రిజర్వాయర్ పొంగిపొర్లుతోంది. ప్రాజెక్టు రెండు గేట్లను తెరిచి 706.30 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.క్లౌడ్ బరస్ట్ కారణంగా జమ్ము కశ్మీర్‌లో భారీ వర్షాలు కురిశాయి. గండేర్‌బాల్ జిల్లాలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. చెట్లు నేలకొరిగాయి. పంటపొలాలన్నీ బురదతో నిండిపోయాయి. పలు వాహనాలు వరదలో చిక్కుకున్నాయి. రంగంలోకి దిగిన ఆర్మీ బలగాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. మరవైపు జమ్ముకశ్మీర్‌లో కొండచరియలు విరిగిపడడంతో.. శ్రీనగర్-లేహ్ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. స్పందించిన అధికారులు శిథిలాలను తొలగించే పనులు చేపట్టారు.
హిమాచల్ ప్రదేశ్‌లో క్లౌడ్ బరస్ట్ కారణంగా లాహౌల్, స్పితి జిల్లాలో రెండు వంతెనలు కొట్టుకుపోయాయి. మనాలీ-లడఖ్ రోడ్‌లో ఉన్న కోఫ్తా బ్రిడ్జి వరద ఉధృతికి తెగిపోయింది. ఇందులో ఒక వంతెనను ఇటీవలే నిర్మించారు. బుల్డోజర్లతో బండరాళ్లు తొలగించి రోడ్డును క్లియర్ చేస్తున్నారు ఆర్మీ సిబ్బంది. రెండు రోజుల్లో వంతెనను తిరిగి నిర్మిస్తామని చెబుతున్నారు. క్లౌడ్ బరస్ట్, వర్షాలు, వరదలతో అల్లాడిపోయిన హిమాచల్‌ప్రదేశ్‌లో సహాయక చర్యలు ముమ్మరం అయ్యాయి. ఇప్పటిదాకా ఆరుగురు చనిపోయారు. 50 మందికి పైగా గల్లంతు అయ్యాయి. అయితే షీలాభావి అనే గ్రామంలో చిక్కుకుపోయిన ఒక కుటుంబాన్ని సైన్యం రక్షించింది. చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు తాత్కాలిక వంతెనలు నిర్మించారు. క్లిష్టమైన ప్రాంతాల నుంచి వారిని ఆ తాత్కాలిక వంతెనల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
హిమాచల్ ప్రదేశ్ సహాయకచర్యల్లో డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించింది సైన్యం. సిమ్లాలోని గాన్వి అనే గ్రామంలో రెస్క్యూ ఆపరేషన్‌లో డాగ్ స్క్వాడ్‌ను భాగం చేశారు. బండరాళ్ల కింద ఆనవాళ్లు దొరుకుతాయా అనే కోణంలో అన్వేషణ చేపట్టారు. గల్లంతైన వారి ఆచూకీకోసం అన్వేషణలో భాగంగానే స్నిఫర్ డాగ్స్‌ను రెస్క్యూ ఆపరేషన్‌లో వినియోగిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని సోన్‌ప్రయాగ్‌లో చిక్కుకున్నారు వెయ్యిమంద్రి యాత్రికులు. సోన్‌ప్రయాగ్ నుంచి కేదార్‌ఘాటికి యాత్రికుల తరలింపు ప్రారంభించారు. క్లౌడ్ బరస్ట్ తర్వాత రోడ్లు పూర్తిగా దెబ్బతినడంతో సోన్‌ప్రయాగ్‌తో ఇతర ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. రెస్క్యూలో భాగంగా సోన్‌ప్రయాగ్‌లో హెలిప్యాడ్ నిర్మించింది ఆర్మీ. ప్రజలను కాపాడేందుకు 6 హెలికాప్టర్లను ఏర్పాటుచేసింది ప్రభుత్వం.
రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో.. పశ్చిమ మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, గుజరాత్, కొంకణ్, గోవా, మహారాష్ట్రలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఆయా ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.