దేశంలో ఇవాళ అందరు నాగులపంచమి పండుగ జరుపుకుంటారు. అక్కడ మాత్రం తేళ్ల పంచమి నిర్వహిస్తారు. తేళ్ల విగ్రహాలకు పూజలు చేస్తారు. అక్కడి కొండపై ఉన్న రాళ్ళ కింద తేళ్లతో ఆటలు ఆడుకుంటారు. వినడానికి వింతగా ఉన్నా… ఇదొక అనాదిగా వస్తున్న ఆచారం. అసలు ఈ తేళ్ళు ఏంటి… ఈ పంచమి ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ మొత్తం చదవాల్సిందే..!కర్ణాటక రాష్ట్రం యాద్గిర్ జిల్లా కందుకూరు గ్రామంలో అనాది గా ఓ వింత ఆచారం కొనసాగుతూ వస్తోంది. దేశవ్యాప్తంగా ఇవాళ భక్తులు నాగుల పంచమి సందర్భంగా పాములను కొలిస్తే ఇక్కడ మాత్రం గ్రామ సమీపంలోని కొండపై ఉన్న కొండమేశ్వరీదేవిని కొలుస్తారు. అలాగే ఇక్కడ తేళ్ల విగ్రహాలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. పూజల అనంతరం గుట్టపై ఉన్న రాళ్ళ కోసం పరుగులు తీస్తారు. విశేషం ఏంటంటే ఇక్కడ ఏ రాయి తీసిన వివిధ రకాల తేళ్లు దర్శనం ఇస్తాయి. అయితే వాటితో ఇవాళ ఒక్కరోజు ఆటలు ఆడుకుంటారు అక్కడికి వచ్చే భక్తులు. చిన్నా, పెద్దా తేడా లేకుండా తేళ్ల ను తమ శరీరంపై ఎక్కించుకుంటారు. వాటితో ఆడుకుంటూ సరదాగా గడుపుతారు.
ఈ ఒక్క రోజు ఏమీ అనని తేళ్ళు
అసలే తేళ్ళు విషపూరితాలు. ఏమి అనవా అనే డౌట్ రావచ్చు. వాస్తవంగా దశాబ్దాలుగా జరుగుతున్న ఈ వేడుకల్లో ఏనాడు ఎవరికి ఏమి జరగలేదని భక్తులు చెబుతున్నారు. అయితే ఈ ఒక్కరోజు మాత్రమే ఆ తేళ్ళు ఏమి చేయవట. అవి కరిచినా అమ్మ వారి ఆధారం అంటిస్తే తగ్గుతుందని భక్తుల నమ్మకం. ఇది అనాదిగా వస్తున్న ఆచారమని చెబుతున్నారు. ఇదే ఇక్కడి కొండమేశ్వరీ అమ్మవారి ప్రత్యేకత అని విశ్వసిస్తున్నారు. ఇలా ప్రతి సంవత్సరం నాగుల పంచమి నాడు కందుకూరు కొండపై పెద్ద ఎత్తున తేళ్ల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చి పూజలు నిర్వహిస్తారు. ఇక కర్ణాటక లోనే నలుమూలలే కాకుండా, తెలంగాణ, మహారాష్ట్రల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారు. కొంతమంది అమ్మవారిని దర్శించుకుని తేళ్ళతో సరదాగా గడిపేవారైతే మరికొందరు కేవలం ఈ వేడుకలను తిలకించేందుకు వస్తారు.ప్రత్యేక పోలీసుల భద్రత చర్యలు
ఇక తేళ్ల పంచమి నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసేందుకు యాద్గిర్ జిల్లా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అలాగే భక్తులు తేళ్లతో ఆడేటప్పుడు పలు జాగ్రత్తలు, సూచనలు చేస్తున్నారు. కొంతమంది పోలీసులు సైతం సరదాగా తేళ్లతో ఆటలాడారు.