విశాఖ తీరంలో మరో పొలిటికల్ ఫైట్‌కు తెరలేస్తుందా ? ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ప్లాన్ చేస్తున్న వైసీపీకి విజయం దక్కుతుందా ? జనసేన ఎమ్మెల్యే చెప్పినట్టు వైసీపీకి బిగ్ షాక్ తప్పదా ?.. ఏపీ రాజకీయవర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్..
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పొలిటికల్‌గా హీట్ పెంచుతోంది. ఎన్నికకు సమయం దగ్గర పడేకొద్దీ.. అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించిన వైసీపీ… విజయం కోసం పక్కాగా ప్లాన్ చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సిట్టింగ్ సీటు చేజారనివ్వొద్దని భావిస్తున్నారు జగన్. విశాఖ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ప్రలోభాలు లొంగిపోవద్దని.. బెదిరింపులకు భయపడొద్దని నేతలకు సూచించారు. వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ కూడా ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. అనకాపల్లి, నర్సీపట్నం, పాయకరావుపేట ప్రాంతాల్లో పర్యటించి పార్టీ కేడర్‌తో వరుస సమావేశాలు, సమీక్షలు నిర్వహించారు. ఇప్పటికే తమ నేతలను వైసీపీ బెంగళూరు క్యాంప్‌కు తరలించింది. ఆగస్టు 12న వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని మాజీమంత్రి ధీమాగా ఉన్నారు.
నేడు కూటమి అభ్యర్థిపై క్లారిటీ..
ఓ వైపు ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ ప్రయత్నాలు చేస్తుంటే.. కూటమి పార్టీల వ్యూహం ఏమిటో అంతుచిక్కడం లేదు. ఇటీవల విశాఖ జిల్లా ఎమ్మెల్యేలతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. అయితే భేటీలో అభ్యర్థి ఎంపికపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే దీనిపై జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఎవరనేది సోమవారం ప్రకటించే అవకాశం ఉందని వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తరపున బరిలో నిలిచే అభ్యర్థిని ఎవరనే దానిపై త్వరలోనే క్లారిటీ వస్తుందన్నారు. భారీ మెజార్టీతో కూటమి గెలిపించి తీరుతామన్నారు. ఎవరు ఎన్ని క్యాంపులు పెట్టినా.. ఓట్లు మాత్రం తమకే పడతాయన్నారు.విశాఖ ఎమ్మెల్సీ స్థానానికి ఆగస్టు 13తో నామినేషన్ల గడువు ముగుస్తుంది. నామినేషన్‌కు ఇంకా ఒక్క రోజు మాత్రమే గడువు ఉండటంతో.. కూటమి అభ్యర్థి బరిలోకి దిగుతారా ? లేదా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకవేళ కూటమి తరపున అభ్యర్థి బరిలోకి దిగితే.. విశాఖ తీరంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రాజకీయం మరింత రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.