ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలోని భూభాగంలో తనిఖీలు, దర్యాప్తు చేసే అధికారాన్ని సీబీఐకి కల్పించే జనరల్ కన్సెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. అయితే… రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులపై సీబీఐ దర్యాప్తునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘వ్రాతపూర్వక అనుమతి’ తప్పనిసరి చేసింది.ఏపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ ఎంట్రీకి కూటమి సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఏపీలో సీబీఐ విచారణకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలోని కేంద్ర సంస్థలు, ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే విచారణ చేపట్టేందుకు గెజిట్ రిలీజ్ చేసింది. అయితే.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రం విచారణ చేపట్టే ముందు అనుమతి తప్పనిసరి అని కండీషన్ పెట్టింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జూలై 1నుంచే అమల్లోకి వచ్చినట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీలో సీబీఐ విచారణ పరిధిని కొనసాగించేందుకు.. పెంచేందుకు ఈ గెజిట్ వీలు కల్పిస్తుంది. దీని ద్వారా సీబీఐ నిర్ధారించిన నేరాలపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చినట్లు అయింది.చంద్రబాబు నాయుడు 2018లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఏపీలో సీబీఐ దర్యాప్తునకు ‘సాధారణ సమ్మతిని’ ఉపసంహరించుకున్నారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీలో సీబీఐ ప్రవేశంపై నిషేధాన్ని ఎత్తివేసింది. తాజాగా రాష్ట్రంలో సీబీఐ ఎంట్రీకి సమ్మతి ఇస్తూనే.. రాష్ట్ర ప్రభుత్వ వ్రాతపూర్వక అనుమతితో మినహా, ఏపీ ప్రభుత్వం నియంత్రణలో ఉన్న ప్రభుత్వోద్యోగులకు సంబంధించిన కేసుల్లో సీబీఐ ఎలాంటి దర్యాప్తు చేపట్టరాదని ఎన్డీఏ సర్కార్ షరతు విధించింది. ఈ మేరకు ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DSPE) చట్టం, 1946 (1946 చట్టం నెం.25)లోని సెక్షన్ 3 కింద కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన సెక్షన్ల దర్యాప్తు కోసం AP రాష్ట్రంలో CBI అధికార పరిధిని పొడిగిస్తూ గెజిట్ నోటిఫికేషన్ 792ను రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజీత్ జారీ చేశారు.
సీబీఐ ఎంట్రీకి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణ సమ్మతి ఇవ్వకపోతే.. దర్యాప్తు చేయడానికి వీల్లేదు. ఒకవేళ కోర్టు ప్రత్యేకంగా ఆదేశిస్తే.. ఆ కేసును సీబీఐ టేకప్ చేస్తుంది.