మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు కసరత్తు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. విజయవాడ, విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టులు రెండు దశల్లో చేపట్టాలని భావిస్తోంది. మెట్రో రైలు ప్రాజెక్టు పనులు మరింత స్పీడప్ చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.పాలనలో తనదైన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అందులో భాగంగా 2014-19 హయాంలో తమ పాలనలో ప్రారంభించి… ఆ తర్వాత నిలిచిపోయిన పనులు, ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే ఏపీలో ఆగిపోయిన మెట్రో ప్రాజెక్టును మళ్లీ వెలుగులోకి తెచ్చారు. ఇప్పటికే మెట్రో కార్పొరేషన్ ఎండీగా అప్పటి రామకృష్ణారెడ్డినే మళ్లీ నియమించారు. తాజాగా సీఆర్డీఏ అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు… మెట్రో రైలు ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
పండిట్ నెహ్రూ బస్టాండ్ – గన్నవరం ఎయిర్ పోర్టు
విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టు వరకు మొదటి దశలో మెట్రో పనులు చేపట్టేందుకు ప్రస్తుతం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెండో దశలో అమరావతిలో మెట్రో పనులు చేపట్టాలని భావిస్తోంది. ఫేజ్-1 కోసం రూ.11వేల కోట్లు, ఫేజ్-2 కోసం రూ.14వేల కోట్లు అవసరమవుతాయని మంత్రి నారాయణ వివరించారు.
మొదటి దశ 46.23 కిలోమీటర్లకు రూ.11,400 కోట్లు
విశాఖ మెట్రో ఫేజ్-1 కొమ్మాది జంక్షన్ నుంచి స్టీల్ ప్లాంట్ వరకు, ఫేజ్-2 కొమ్మాది జంక్షన్ నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు మెట్రో పనులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదటి దశ 46.23 కిలోమీటర్లకు రూ. 11,400 కోట్లు, రెండో దశకు రూ.5,700 కోట్లు వ్యయం అవుతుందని మంత్రి నారాయణ తెలిపారు.
ఈ మెట్రో ప్రాజెక్టులకు సంబంధించిన మొదటి దశకు అయ్యే ఖర్చును తర్వరలోనే కేంద్రానికి పంపనున్నారు. మొత్తంగా… విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రోను పరుగులు పెట్టించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న ఏపీ ప్రభుత్వం… త్వరలోనే ప్రాజెక్టు తిరిగి పట్టాలెక్కనుంది.