ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో విశాఖపట్నంవాసులు ( Visakapatnam) భయాందోళనకు గురవుతున్నారు. నగరంలోని గోపలపట్నంలో రామకృష్ణనగర్ కాళీమాత ఆలయం దారిలో కొండచరియలు(Landslide) విరిగిపడ్డాయి. కొండచరియల ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ముందస్తుగా అక్కడి నుంచి ఖాళీ చేయిస్తున్నారు. ఎంవీసీ కాలనీలోని ప్రధాన డ్రైనేజ్ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం వర్షాల కారణంగా విశాఖ, అనకాపల్లి, అల్లూరి, శ్రీకాకుళం జిల్లాల్లోని విద్యా సంస్థలకు ముందస్తుగా సెలవు ప్రకటించారు.
విశాఖ కలెక్టరేట్‌లో సైక్లోన్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
విశాఖ కలెక్టరేట్‌లో సైక్లోన్ కంట్రోల్ రూమ్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. విశాఖ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 0891-2590100, 0891-2590102, పోలీసు కంట్రోల్ రూమ్ 0891-2565454, డయల్ 100, 112 కు ఫోన్ చేయాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విశాఖ జిల్లాలోని పలు మండలాల్లోనూ కంట్రోలు రూమ్‌లు ప్రారంభించారు.