వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ప్రస్తుతం పూరీకి వాయవ్య దిశగా పయనిస్తోందని, దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. ఆంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని పేర్కొంది.. అయితే.. తీవ్ర వాయుగుండం పూరీ సమీపంలో తీరం దాటినట్లు అధికారులు తెలిపారు. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. కోస్తాలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ రెండు రోజులపాటు కోస్తాంధ్రకు వర్ష సూచన చేసింది. కొన్ని జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని.. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు.ఈ వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఇక కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. దీనివల్ల ఆయా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈ తీవ్ర వాయుగుండంతో ఉమ్మడి విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్. తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని, ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేశామన్నారు ఆయన. భూమిలోకి ఇంకని నీరు, రిజర్వాయర్ల వరదతో ఫ్లాష్ ఫ్లడ్స్‌కు ఆస్కారం ఉందంటున్నారు శ్రీనివాస్.వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో ఏపీలో జిల్లాకో జలగండం పొంచి ఉంది. వారం రోజులకు పైగా బెజవాడను కకావికలం చేసింది బుడమేరు. ఎట్టకేలకు దాని గండ్లను పూడ్చడంతో పాటు గట్లను 4 అడుగులకు పైగా ఎత్తు పెంచి పటిష్ట పరుస్తున్నారు అధికారులు. అయితే ఇప్పుడు మళ్లీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేయడంతోపాటు కీలక ఆదేశాలిచ్చింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే.. కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో.. అప్రమత్తంగా ఉండాలని.. అధికారులు రిపోర్ట్ ను ఎప్పటికప్పుడు చేరవేయాలని ఆదేశించారు.