అమెరికాలో సగటున 45 ఏళ్ల వారికి గుండెపోటు వస్తే.. భారత్‌లో మాత్రం 35 ఏళ్ల వయసులోనే ఈ సమస్య రావడం గమనార్హం. అయితే సాధారణంగా గుండెపోటు అనగానే అధికరక్తపోటు, శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం, మధుమేహం వంటివే ప్రధాన కారణాలుగా భావిస్తుంటాం. అయితే ప్రస్తుతం ఈ జాబితాలోకి స్క్రీన్ టైం కూడా వచ్చి చేరింది. గంటల తరబడి ల్యాప్‌టాప్‌లు…దేశంలో గుండెపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఒకప్పుడు వయసు మళ్లిన వారిలో మాత్రమే కనిపించిన ఈ సమస్య ఇప్పుడు తక్కువ వయసు ఉన్న వారిని వేధిస్తోంది. మరీ ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత ఈ సంఖ్య ఎక్కువైంది. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, శారీరక శ్రమ పూర్తిగా తగ్గడం కారణం ఏదైనా గుండెపోటు మరణాలు భారీగా పెరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్‌లకు అతుక్కుపోవడం కూడా గుండెపోటు వచ్చేందుకు కారణాలుగా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
రోజుకు 8 నుంచి 10 గంటల పాటు స్క్రీన్‌ను అతుక్కుపోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. దీనికి తోడు ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేవారిలో కూడా ఈ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఫుడ్ ఆర్డర్స్‌లో వచ్చే ఆహార పదార్థాల్లో నాసికరం నూనె ఉపయోగించడం, కొవ్వు శాతం అధికంగా ఉండడం వంటి వాటివల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోనే ఫుడ్ ఫుడ్ ఆర్డర్లలో భారతదేశం అగ్రస్థానంలో ఉండడం గమనార్హం.గంట తరబడి కూర్చోవడం, కూర్చున్న చోటే ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం వంటి సమస్యల కారణంగా గుండెపోటు వచ్చే సమస్య ఎక్కువవుతున్నట్లు పరిశధకులు చెబుతున్నారు. వ్యాయామం పూర్తిగా తగ్గడం, శారీరక శ్రమ లేకపోవడం కూడా గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని అంటున్నారు. సగటున రోజుకు కనీసం 45 నిమిషాల చొప్పున కచ్చితంగా వాకింగ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. వారంలో కనీసం ఐదు నుంచి ఆరు రోజుల పాటు వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. నిశ్చల జీవనశైలి వల్ల కూడా చిన్నవయసులోనే గుండెపోటు కేసులు వస్తున్నాయని అంటున్నారు.
ఇక భారత్‌లో గుండె పోటు సమస్య వచ్చేందుకు మానసిక ఒత్తిడి, నిద్రలేమి కూడా గుండెపోటుు దారి తీస్తోందని నిపుణులు చెబుతున్నారు. తీవ్రమైన మానసిక ఒత్తిడి, నిద్రలేమి సమస్య కారణంగా గుండెపోటు వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. రోజు కనీసం 7 నుంచి 8 గంటల నాణ్యమైన నిద్ర ఉండాలని చెబుతున్నారు. వీటన్నింటితో పాటు సిగరెట్లు కాల్చడం, వాతావరణ కాలుష్యం వంటివి కూడా గుండెపోటుకు దారి తీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.