ఆంధ్రప్రదేశ్ లో అర్ధాంతరంగా ఆగిపోయిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియను సత్వరమే చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. మొత్తం 6,100 పోస్టుల భర్తీకి సంబంధించిన శారీరక సామర్థ్య (పీఎంటీ, పీఈటీ) పరీక్షలను 5 నెలల్లోగా పూర్తి చెయ్యనున్నారు. గత 2022 కాలంలో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 4,59,182 మంది హాజరుకాగా, అందులో 95,209 మంది తదుపరి దశకు ఎంపికయ్యారన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సహా పలు కారణాల వల్ల వాయిదా పడడంతో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్ (సివిల్) 3580, కానిస్టేబుల్ (APSP) -2520 పోస్టుల ప్రక్రియ వాయిదా పడింది.ప్రిలిమినరీ దాత పరీక్షకు మొత్తం 3,622 మంది హోంగార్డులు హాజరవగా.. అందులో 382 మంది హోంగార్డులు మాత్రమే అర్హత సాధించారు. ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించని 100 మంది హోంగార్డులు 14 రిట్ పిటిషన్లను హైకోర్టులో వేశారు. హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించడం ద్వారా హోంగార్డుల కోటాలో ప్రత్యేక మెరిట్ జాబితాను ప్రకటించాలని కోర్టును కోరారు. ఆ వంద మంది హోంగార్డులను తదుపరి దశకు అనుమతించాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి రిక్రూట్మెంట్ ప్రక్రియ వెనుక పడింది. ఈ విషయంపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది.
దీనిపై న్యాయ సలహా తీసుకొని.. ఆ సలహా మేరకు ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియలో రెండవ దశ (PMT/PET)ను వెంటనే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రెండవ దశ అప్లికేషన్ ఫారం నింపడానికి, భర్తీ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్ లో పొందుపరుస్తామని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. రెండవ దశలో ఉత్తీర్ణులైన వారికి మూడవ దశ ప్రధాన పరీక్ష జరగనుంది.