వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశలో కేంద్రం అడుగులు వేస్తోంది. ఆర్థికంగా నష్టాల్లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో విలీనం చేసేందుకు కసరత్తు చేస్తోంది. వైజాగ్ స్టీల్ మనుగడకు విలీనాన్ని కేంద్రం ఒక ప్రత్యామ్నాయంగా భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తాజాగా కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మతో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థల చైర్మన్లు సమావేశమయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్‌ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేసే అంశాలపై చర్చించారు. స్టీల్ ప్లాంట్‌కు చెందిన భూములను ఎన్‌ఎండీసీకి విక్రయించడం, బ్యాంకు రుణాలవంటి ప్రత్యామ్నాయ అంశాలు కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టీల్‌ప్లాంట్‌ని సెయిల్‌లో విలీనం చేయాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ .. కొన్ని సాంకేతిక అంశాలు అడ్డుపడుతున్నాయని, NMDCకి స్టీల్ ప్లాంట్ భూములు అప్పగించే ఆలోచన కూడా చేస్తున్నామని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు.స్టీల్ ప్లాంట్ అంశంపై ఎస్‌బీఐతో కేంద్ర ఉన్నతాధికారుల భేటీ
ఇటీవల వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంపై చర్చించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కేంద్ర ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ప్లాంట్‌కు మూలధన పెట్టుబడికోసం రుణాలు అందించడం, పెల్లెట్ ప్లాంట్ కోసం NMDCకి రెండు వేల ఎకరాల భూమిని విక్రయించే యోచన కూడా ఉందని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ చేస్తోంది. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల విక్రయంపై ఇప్పటికే సీబీఐ మాజీ జేడీ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. స్టీల్ ప్లాంట్‌కి చెందిన 24.99 ఎకరాలను మాత్రమే యాజమాన్యం విక్రయించేందుకు అనుమతించిన హైకోర్టు మిగిలిన భూములపై యథాతథస్థితి కొనసాగించాలని ఆదేశించింది.
ప్రైవేటీకరణ నిర్ణయంతో భగ్గుమన్న కార్మిక సంఘాలు
నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటీకరించాలని కేంద్రం గతంలో నిర్ణయం తీసుకుంది. కనీస సామర్థ్యంతో పని చేస్తుండటమే నష్టాలు పెరిగిపోవడానికి కారణమని కేంద్రం ఇప్పటికే అంచనాకు వచ్చింది. మరోవైపు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ని లాభాల్లోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని బీజేపీ ఎంపీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మరోసారి స్పష్టం చేశారు. ఈ దిశగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కూడా సీఎం చంద్రబాబుతో మాట్లాడారని.. కానీ ప్రతిపక్ష పార్టీలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై అసత్య ప్రచారం చేస్తున్నాయని పురంధేశ్వరి అన్నారు.సెయిల్‌లో స్టీల్‌ప్లాంట్ విలీనం!
ఇతర ఉక్కు పరిశ్రమల మాదిరిగా సొంత గనులు లేకపోవడమే విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలకు కారణమని కార్మిక సంఘాలు అంటున్నాయి. అందుకే సెయిల్‌లో విలీనం చేయాలన్న డిమాండ్‌ను కూడా కార్మిక సంఘాలు చేస్తున్నాయి. గతంలో స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని నిర్ణయించిన కేంద్రం.. కార్మికుల ఆందోళనలు, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్న ఒత్తిడి వంటి అంశాల్ని దృష్టిలో ఉంచుకుని దీన్ని కేంద్ర ప్రభుత్వ సంస్ధ అయిన సెయిల్ లో విలీనం చేస్తే బెటర్ అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేసే దిశగా కేంద్రం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.