బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వచ్చే 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది.తమిళనాడు ఉత్తరం- దక్షిణ కోస్తా తీర ప్రాంతాల వైపు కదులుతుందని తెలిపింది.
ఈ వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తోన్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి. అటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపైనా ప్రతాపం చూపుతున్నాయి. అల్పపీడనం తీరానికి తీరం వైపు కదులుతున్న కొద్దీ వర్షాల తీవ్రత అధికమౌతూ వస్తోంది.
సోమవారం అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. గుంటూరు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి.ఇదే పరిస్థితి మరో 48 గంటల పాటు కొనసాగుతుందని వాతావరణ కేంద్రం, ఏపీ విపత్తుల నిర్వహణ అథారిటీ వెల్లడించాయి. ప్రత్యేకించి- దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య రాయచోటి, శ్రీసత్యసాయి పుట్టపర్తి, అనంతపురం, నంద్యాల, కడప, కర్నూలు జిల్లాలపై వాయుగుండం ప్రభావం అధికంగా ఉండబోతోంది.
భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేశారు. భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి నేడు ఇచ్చే సిఫారసు లేఖలను స్వీకరించబోమనీ తెలిపారు.మరోవైపు- తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల పోటెత్తుతోంది. భారీ వర్షాలను సైతం భక్తులు లెక్క చేయట్లేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్ భారీగా ఉంటోంది.
సోమవారం నాడు 75,361 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 28,850 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. టోకెన్ లేని భక్తులకు స్వామివారి సర్వ దర్శనానికి 20 గంటల సమయం పట్టింది. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా టీటీడీకి 3.91 కోట్ల రూపాయల ఆదాయం అందింది.