శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ఎలుగుబంట్లు హల్చల్ చేస్తున్నాయి. అభయారణ్యంలో ఉండాల్సిన ఎలుగుబంట్లు జనారణ్యం బాట పడుతున్నాయి. రాత్రి పగలు అన్న తేడా లేకుండా ఎలుగుబంట్లు జనావాసాలలోకి వచ్చి హల్ చల్ చేస్తున్నాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.ఉద్దాన ప్రాంతంలో చివరకు కార్తీక మాస పూజలపై కూడా ఎలుగుబంట్లు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. తెల్లవారు జామున సముద్ర స్నానాలు, నదీ స్నానానికి వెలాలన్నా.. కార్తీక దీపాలు వెలిగించాలన్నా ఎలుగుబంట్లు సంచారంతో బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లోకి వచ్చే ఎలుగుబంట్లు ఆలయాల వద్దే తిష్ట వేస్తున్నాయి. ఆలయాల్లో దేవుని వద్ద ఉండే కొబ్బరి ముక్కలు, అరటిపళ్ళు, ఇతర ప్రసాదాలు, ఆయిల్ కోసం అవి దేవాలయాలకు వస్తూ ఉంటాయి.
దీంతో తెల్లవారుజామున చీకట్లో దైవ దర్శనం కోసం ఆలయాలకు వెళ్ళాలన్న మహిళలు భయపడిపోతున్నారు. గతంలో కూడా గ్రామాల్లోకి చొరబడిన ఎలుగుబంట్లు గ్రామస్తుల పైకి దాడి చేసి ప్రాణాలను బలిగొనటం, పలువురిని గాయపరచటం వంటి ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి.తాజాగా మందస మండలం సువర్ణపురం గ్రామ శివాలయంలో తెల్లవారుజామున ఎలుగు బంట్లు హల్చల్ చేశాయి.కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున కుటుంబ సమేతంగా శివుని దర్శనం చేసుకోడానీకి వచ్చినట్లు తల్లి ఎలుగుబంటి రెండు పిల్ల ఎలుగుబంట్లు శివాలయంకి వచ్చాయి. శివాలయానికి వెళ్ళిన భక్తులు ఎలుగుబంట్లును చూసి పరుగులు పెట్టారు.తీవ్ర భయాందోళనలు చెందారు.వెంటనే అటవీశాఖ సిబ్బందికి సమాచారమిచ్చారు గ్రామస్తులు. వాటికి ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడొద్దని అటవీ శాఖ సిబ్బంది సూచించారు.
ఆలయంలోనే ఎలుగుబంట్లు తిష్ట వేయటంతో స్థానికులు కేకలు వేస్తూ ఎలుగుబంట్లును ఆలయం నుండి బయటకు తరిమి వేసారు. ఎలుగుబంట్లు సంచారoపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేస్తున్న పట్టించుకోవటం లేదనీ గరమస్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.